పీఎం కేర్స్ ఫండ్ కు రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన జేఎస్ డబ్ల్యూ గ్రూప్
- కరోనా మహమ్మారిపై పోరుకు సంఘీభావం ప్రకటించిన జేఎస్ డబ్ల్యూ గ్రూప్
- ప్రభుత్వానికి అన్ని విధాలా సాయమందిస్తామన్న గ్రూప్ చైర్మన్
- ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చిన జేఎస్ డబ్ల్యూ ఉద్యోగులు
నిర్మాణ రంగ ఉత్పత్తుల దిగ్గజం జేఎస్ డబ్ల్యూ గ్రూప్ కరోనా మహమ్మారిపై పోరాటానికి తన వంతు మద్దతు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కు రూ.100 కోట్ల విరాళం ఇస్తున్నట్టు వెల్లడించింది. కరోనాపై పోరులో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న వైద్యసిబ్బందికి రక్షణ కవచాలు, రోగులకు వెంటిలేటర్లు, కరోనా టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేసేందుకు ఈ విరాళం ఉపయోగించాలని కోరుతున్నామని జేఎస్ డబ్ల్యూ గ్రూప్ ఓ ప్రకటనలో వివరించింది. కంపెనీకి చెందిన అనేక భవనాలను ఐసోలేషన్ వార్డులుగా మార్చుతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ స్పందిస్తూ, కరోనా వైరస్ పై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం అందిస్తామని చెప్పారు. అటు, జేఎస్ డబ్ల్యూ గ్రూప్ సంస్థలకు చెందిన ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని కూడా విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.