కరోనాను తరిమేయగల వాక్సిన్ ను కనిపెట్టిన హైదరాబాద్ వర్శిటీ బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ సీమా మిశ్రా!

  • వర్శిటీలో బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పని చేస్తున్న సీమా మిశ్రా
  • టీ-సెల్ ఎపిటోప్స్ పేరిట కణాల సృష్టి
  • కరోనా కారణంగా చెడిపోయే కణాలను అంతం చేస్తున్న ఎపిటోప్స్
  • శాస్త్ర సాంకేతిక నిపుణులకు ప్రయోగ ఫలితాలు
కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ, ఎన్నో దేశాలు ఈ వైరస్ ను అరికట్టే వాక్సిన్ ను తయారు చేసే దిశగా, తమ ప్రయత్నాలను ముమ్మరం చేయగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ (హెచ్‌సీయూ) ఓ అడుగు ముందుకేసింది. వర్శిటీలో బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పని చేస్తున్న సీమా మిశ్రా, వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని ఆమె కనిపెట్టారు. దీనికి ఆమె 'టీ-సెల్ ఎపిటోప్స్' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని వర్శిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రయోగశాలలో ఈ వాక్సిన్, వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత నోవల్ కరోనా వైరస్-2 (2019-ఎన్ సీఓవీ) ప్రోటీన్లపై పని చేసిందని పేర్కొంది.  

వైరస్ సోకిన వ్యక్తి శరీరంలో చెడిపోయిన కణాలను అంతం చేయడంలో తాము సృష్టించిన ఈ ఎపిటోప్స్ సమర్ధవంతంగా పని చేశాయని, ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్న ఈ ఎపిటోప్, మానవ శరీరంలో ఆరోగ్యవంతంగా ఉన్న కణాలకు ఎటువంటి హాని చేయవని ఈ సందర్భంగా సీమా మిశ్రా వెల్లడించారు. పూర్తిస్థాయిలో పరిశోధన జరిగి, తమ ప్రయత్నం సఫలమైతే, పూర్తి జనాభాకు ఒకేసారి వాక్సిన్ ను అందించడం ద్వారా కరోనా వైరస్ ను రూపుమాపవచ్చని అన్నారు.

సాధారణ పరిస్థితుల్లో ఓ వాక్సిన్ ను కనుగొనేందుకు ఏడాదిన్నర సమయం పడుతుంది. అయితే, శక్తిమంతమైన కంప్యుటేషనల్ టూల్స్ సహాయంతో వాక్సిన్ కు తాము 10 రోజుల్లోనే ఓ రూపు తేగలిగామని సీమా మిశ్రా తెలిపారు. ఇందులో భాగంగా మానవ శరీరంలోని కణజాలంలో వైరస్ ను అడ్డుకునేలా వాక్సిన్ ఎలా పని చేస్తుందో కనిపెట్టామని, ఈ కరోనా వైరస్ ఎపిటోప్స్, శరీరంలోని కణాలతో సంబంధాలు పెట్టుకుని, ఇతర సమస్యలను ఉత్పన్నం చేయబోవని ఆమె భరోసా ఇచ్చారు.

ఇండియాలోని శాస్త్ర సాంకేతిక నిపుణులకు తమ ప్రయోగ ఫలితాలను గురించి తెలియజేశామని, అత్యవసరంగా దీన్ని పరిశీలించాలని కోరామని, అయితే, ప్రస్తుతానికి కరోనా వైరస్‌ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టుగా భావించరాదని, సామాజిక దూరం పాటించడం ద్వారా మాత్రమే వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలమని తెలిపారు.


More Telugu News