తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి... ఒకరు చనిపోయారు: ఈటల

  • తెలంగాణలో తొలి కరోనా మరణం
  • ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65
  • ప్రయాణాలు చేసినవారే ఎక్కువగా కరోనా బారినపడుతున్నారన్న ఈటల
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోందని, ఢిల్లీ వెళ్లొచ్చిన పలువురు కరోనా బారినపడ్డారని వివరించారు. గ్లోబల్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన తర్వాత వైద్యపరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. కుత్బుల్లాపూర్ నుంచి ఒకే కుటుంబం నుంచి నలుగురు వచ్చారని, వారికి వైద్యపరీక్షలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పునరుద్ఘాటించారు.

మరణించిన వ్యక్తి నాంపల్లికి చెందినవాడని, ఆయన వయస్సు 74 సంవత్సరాలని తెలిపారు. ఈ నెల 14న మత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లి అనారోగ్యం పాలయ్యారని, సైఫాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడని వివరించారు. వృద్ధుడి మృతదేహాన్ని తీసుకుని కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్ వచ్చిందని తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాదుకు ఉపాధి కోసం వచ్చినవాళ్లు ఆకలితో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించామని తెలిపారు. ప్రభుత్వం వారిలో భరోసా కల్పించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలు చేస్తామని వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి భోజన కేంద్రాలు, వసతి ఏర్పాట్లు చేస్తామని అన్నారు. నిన్న ఒకేసారి 9 పాజిటివ్ కేసులు రావడంతో సీఎం కేసీఆర్ మరిన్ని చర్యలు తీసుకోవాలని గట్టిగా చెప్పారని ఈటల వెల్లడించారు. అప్పటినుంచి సీఎం మూడు పూటలా సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇవాళ 6 కేసులు వచ్చాయని, వీరందరూ ప్రయాణాలు చేసినవారేనని అన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో 65 కేసులు నమోదయ్యాయని, వాటిలో ఓ మరణం కూడా ఉందని పేర్కొన్నారు.


More Telugu News