ప్రకాశం జిల్లాలో 2,500 మంది కూలీలను అడ్డుకున్న పోలీసులు

  • స్వగ్రామాలకు తరలి వెళ్తున్న వేలాది మంది కూలీలు
  • అనుమతి లేక ఎన్నో ఇబ్బందులు
  • ఆహారం అందిస్తోన్న స్థానికులు, పోలీసులు
  • ఘజియాబాద్‌, నోయిడాల్లో కూలీల కోసం బస్సులు పంపిన యూపీ ప్రభుత్వం
ప్రకాశం జిల్లా జి.ఉమ్మడి వరం వద్ద దాదాపు 2,500 మంది కూలీలు చిక్కుకుపోయారు. కొన్ని రోజుల క్రితం వారు గుంటూరు జిల్లాలో మిర్చికోత పనులకు వెళ్లారు. లాక్‌డౌన్‌ విధించడంతో తినడానికి తిండి లేక, ఏదైనా కొనుక్కోవడానికి డబ్బు లేక తీవ్ర అవస్థలు పడ్డారు.

దీంతో ఒక్కసారిగా వారంతా కలిసి పలు వాహనాల్లో స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో వారందరినీ జి.ఉమ్మడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పనుల్లేక కర్నూలు జిల్లాలోని తమ స్వగ్రామాలకు వెళ్తున్నామని, తమని వెళ్లనివ్వాలని పోలీసులను కోరారు. అనుమతి లేదంటూ పోలీసులు వారిని అక్కడే ఆపేశారు. వారికి స్థానికులు, పోలీసులు కలిసి ఆహారం, తాగునీళ్లు అందిస్తున్నారు.

మరోపక్క, దేశ వ్యాప్తంగా వలసకూలీల బాధలు వర్ణనాతీతంగా మారాయి. వేలాది మంది కూలీలు వందలాది కిలోమీటర్లు నడుస్తూ తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి బయలుదేరుతున్నారు. ఢిల్లీ, యూపీ సరిహద్దు ఘజియాబాద్‌ వద్ద వేలమంది వలస కూలీలు చేరుకున్నారు.

వారి బాధల పట్ల యూపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారిని ఆదుకుంది. ఘజియాబాద్‌తో పాటు నోయిడా వద్దకు చేరుకున్న కూలీలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్సులు పంపింది.


More Telugu News