అలాంటి వాళ్లు నా దృష్టిలో దేశభక్తులు కాదు: విరాట్ కోహ్లీ

  • లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంపై భారత కెప్టెన్‌ అసహనం
  • ఇప్పటికైనా మేల్కొని బాధ్యతగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి
  • ప్రభుత్వ సూచనలు పాటించాలని హితవు 
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. మన భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న సూచనలు పట్టించుకోవాలని ప్రజలను కోరాడు. ఈ మేరకు అతను ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. కరోనాపై చేస్తున్న పోరాటం సాధారణ యుద్ధం కాదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొని బాధ్యతగా ఉండాలని హితవు పలికాడు.

‘ఆటగాడిగా కాదు, దేశ పౌరుడిగా మాట్లాడుతున్నా. కొన్ని రోజులుగా ప్రజల నిర్లక్ష్య వైఖరి చూస్తున్నా. లాక్‌డౌన్, కర్ఫ్యూ పట్టించుకోకుండా రోడ్లపై గుంపులుగా సంచరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కరోనా వైరస్‌ను మీరు తేలిగ్గా తీసుకున్నారని అనిపిస్తోంది. కానీ, మనం ఊహించినట్టుగా ఇది సాధారణమైనది కాదు. సరదా కోసం రోడ్లపైకి రాకండి. అలా చేసేవాళ్లు నా దృష్టిలో దేశ భక్తులు కాదు. దయచేసి సామాజిక దూరాన్ని పాటించండి. ప్రభుత్వ సూచనలు పాటించండి. ఈ దేశానికి మీ మద్దతు, సహాయం అవసరం’ అని కోహ్లీ విజ్ఞప్తి చేశాడు.


More Telugu News