కరోనాను వ్యాపింపజేయాలంటూ పోస్టులు పెట్టి,... అరెస్టైన ఇన్ఫోసిస్  ఉద్యోగి!

  • బెంగళూరు ఇన్ఫోసిస్ లో పని చేస్తున్న ముజీబ్ మొహమ్మద్
  • పబ్లిక్ ప్రదేశాల్లో తుమ్మి, కరోనాను వ్యాపింపజేయాలంటూ ప్రచారం
  • ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన ఇన్ఫోసిస్
కరోనాను విస్తరింపజేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కటకటాలను లెక్కిస్తున్నాడు. అంతేకాదు ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇక ఇతడు  ఏం పోస్ట్ చేశాడు? అనే విషయాలను తెలుసుకుందాం.

ఇతని  పేరు ముజీబ్ మొహమ్మద్. బెంగళూరులో ఇన్ఫోసిస్ సంస్థలో పని చేస్తున్నాడు. కరోనాను ఎలా కట్టడి చేయాలి? అనే విషయంపైనే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే... ఇతను మాత్రం కరోనాను ఎలా వ్యాపింపజేయాలో సోషల్ మీడియాలో సూచనలు ఇచ్చాడు. అసలు ఇతగాడు ఏం చెప్పాడంటే... 'అందరూ చేతులు కలపండి. బయటకు వచ్చి పబ్లిక్ ప్రదేశాల్లో తుమ్మండి. వైరస్ ను విస్తరింపజేయండి'. ఇదీ.. ఫేస్ బుక్ లో 25 ఏళ్ల యువకుడు చేస్తున్న ప్రచారం. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.

ఈ సందర్భంగా బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ, కరోనాను విస్తరింపజేయాలని కోరుతున్న ముజీబ్ ను కటకటాల వెనక్కి పంపించామని తెలిపారు.

ముజీబ్ వ్యవహారంపై ఇన్ఫోసిస్ యాజమాన్యం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని... కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా ముజీబ్ వ్యవహరించాడని తెలిపింది. ఈ వ్యవహారంపై తాము అంతర్గత విచారణ జరిపామని... ఈ పనిని ముజీబ్ ఉద్దేశపూర్వకంగానే చేశాడని నిర్ధారించామని చెప్పింది. ఇన్ఫోసిన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముజీబ్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని ప్రకటించింది.


More Telugu News