కరోనా భయం నేపథ్యంలో.. నాలుగు నిమిషాల్లోనే పెళ్లి పూర్తి!

  • కర్ణాటకలోని కూడ్లిగి తాలూకాలో ఘటన
  • నాలుగు నిమిషాల్లోనే ఒక్కటైన ప్రేమికులు
  • కరోనా భయంతో బంధుమిత్రులు లేకుండానే పెళ్లితంతు పూర్తి
కరోనా భయం ఓ వివాహాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తిచేయించింది. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. సాధారణంగా పెళ్లంటే బంధువుల హడావుడి, మేళతాళాలు వంటివన్నీ ఉంటాయి. కొన్ని గంటలపాటు ఈ తంతు సాగుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అతిథులు పెద్ద సంఖ్యలో వస్తే కరోనా ముప్పు తప్పదని భావించిన ఓ కుటుంబం నాలుగంటే నాలుగు నిమిషాల్లో పెళ్లిని జరిపించి రికార్డులకెక్కింది. కర్ణాటకలోకి కూడ్లిగి తాలూకాలోని సిద్ధాపురంలో జరిగిందీ ఘటన.

గ్రామానికి చెందిన రోహిణి (20), మధు (25) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించడంతో ముహూర్తం నిర్ణయించారు. అయితే, ఈలోపు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో వారికి ఏం చేయాలో పాలుపోలేదు. పెళ్లిని వాయిదా వేయడం కంటే జరిపించడమే మేలని భావించిన ఇరు కుటుంబాల వారు కరోనా భయంతో బంధుమిత్రులను ఆహ్వానించకుండానే కూడ్లిగిలోని మలియమ్మదేవి ఆలయంలో నాలుగు నిమిషాల్లోనే పెళ్లి తంతును పూర్తిచేశారు.


More Telugu News