మద్యం దొరకడం లేదని.. హైదరాబాద్‌లో కార్మికుడి ఆత్మహత్య!

  • పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై నుంచి దూకిన మరో వ్యక్తి
  • కాలు విరగడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
  • మద్యం దొరక్క ఆందోళనలో మందుబాబులు
కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో  చాలా వ్యాపారాలు బంద్ అయ్యాయి. నిత్యావసరాలు, వైద్య, అత్యవసర సదుపాయాలు మినహా అన్ని దుకాణాలకు తాళం పడింది. దీనివల్ల సామాన్యుల సంగతేమో గానీ మద్యానికి బానిసలైన వారి  పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. మద్యం లేకపోవడంతో వాళ్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. మద్యం లభించడం లేదని హైదరాబాద్‌లో ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకోగా.. మరోవ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.  

పోలీసుల వివరాల ప్రకారం బంజారాహిల్స్ ఇందిరానగర్లో ఉంటూ సినీ పరిశ్రమలో పెయింటర్ గా  పని చేస్తున్న మధుకి (55) రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. అయితే, కొన్ని రోజులుగా వైన్‌ షాపులు మూసేయడంతో అతనికి మద్యం దొరకడం లేదు. దాంతో అతను గురువారం రాత్రి బంజారాహిల్స్ పదో నంబర్ రోడ్డులో ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్వార్టర్స్‌లోని ఎనిమిదో బ్లాక్‌ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదిలా ఉంచితే, బేగంపేట బ్రాహ్మణవాడికి చెందిన సాయికుమార్ (32)కు కూడా నిత్యం మందు తాగే అలవాటుంది. టైల్స్‌ పని చేసే కార్మికుడైన సాయికుమార్ కొన్ని రోజులుగా మద్యం దొరకడం లేదని శుక్రవారం పంజాగుట్ట సర్కిల్‌లోని రెండు ఫ్లైఓవర్స్ మధ్య నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే, ప్రాణాపాయం తప్పగా అతని కాలు విరిగింది. పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.


More Telugu News