స్త్రీల కంటే పురుషుల్లోనే కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయి: చంద్రబాబు

  • పురుషులే అత్యధికంగా వాహకాలుగా ఉన్నారని వెల్లడి
  • 80 ఏళ్లు పైబడినవారు జాగ్రత్తగా ఉండాలని సూచన
  • పదేళ్ల లోపువారిలో కరోనా మరణాలు పెద్దగా లేవన్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కరోనా వైరస్ ప్రభావంపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇది మానవ స్పర్శ ఆధారంగా విపరీతమైన స్థాయిలో ప్రబలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది పురుషుల్లో 4.7 శాతం మరణాలు కలిగిస్తోందని, స్త్రీలలో 2.8 శాతం మరణాలు కలిగిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు సంభవించిన మరణాలు చూస్తుంటే పురుషులే అత్యధికస్థాయిలో వాహకాలుగా ఉన్నట్టు అర్థమవుతోందని అన్నారు.

కరోనా మహమ్మారి వయసును బట్టి ప్రభావం చూపిస్తుందని, 80 ఏళ్లు పైబడినవారు జాగ్రత్తగా ఉండాలని, చనిపోయినవారిలో 14 శాతం ఈ వయసు వాళ్లే ఉన్నారని తెలిపారు. 70 నుంచి 80 ఏళ్ల వారిలో 8 శాతం మరణాలు, 60 నుంచి 70 ఏళ్ల వారిలో 3.6 శాతం ఉన్నారని, 50 నుంచి 59 ఏళ్ల వారు 1.9 శాతం ఉన్నారని, 40 నుంచి 50 ఏళ్ల వారు 1.4 శాతం ఉన్నారని, 10 నుంచి 40 ఏళ్ల వయసున్నవారు 0.2 శాతం అని వివరించారు. పదేళ్ల లోపు ఉన్నవారు దీనితో చనిపోయిన దాఖలాలు పెద్దగా లేవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఇక, హృద్రోగ బాధితుల్లో 10.5 శాతం, మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో 7.3 శాతం, దీర్ఘకాలిక శ్వాస సంబంధ సమస్యలున్నవారికి 6.3 శాతం, హైపర్ టెన్షన్ ఉన్నవారిలో 6 శాతం, క్యాన్సర్ బాధితుల్లో 5.6 శాతం మరణాల ముప్పు ఉందని తెలుస్తోందని అన్నారు.


More Telugu News