‘జానకి దాది’ పరమపదించారన్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను: చంద్రబాబునాయుడు

  • ప్రజాపిత బ్రహ్మకుమారి ముఖ్యసంచాలిక జానకి దాది
  • ఆమె గొప్ప ఆధ్యాత్మిక వేత్త..ఆమెను కోల్పోవడం బాధాకరం
  • దాది వద్ద నేర్చుకున్న అంశాలు ఇప్పటికీ నాకు గుర్తుకొస్తున్నాయి
ప్రజాపిత బ్రహ్మకుమారి ముఖ్యసంచాలిక జానకి దాది అస్తమయం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఈ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. భవిష్యత్ సమాజం ఉన్నతి కోసం పరితపించిన జానకి దాది క్రమశిక్షణ, ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా భక్తులలో ఆత్మవిశ్వాసం పెంపునకు కృషి చేశారని, అటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్తను కోల్పోయామని బాధను వ్యక్తం చేశారు.

శాంతి, సంతోషం, సకారాత్మక దృష్టి పెంచడం ద్వారా సమాజాన్ని సుసంపన్నం చేయాలని ఆకాంక్షించిన జానకి దాది, సేవారంగం, ఆధ్యాత్మికరంగాలలో చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజయోగ అభ్యాసం, సత్యాన్వేషణ, మానవతా విలువల పెంపు ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన వ్యక్తి ఆమె అని ప్రశంసించారు.

ఆమె వద్ద నేర్చుకున్న అంశాలు ఇప్పటికీ తనకు గుర్తుకొస్తున్నాయని చెప్పారు.  ‘జానకి దాది భౌతికంగా  మనకు దూరమైనా...  ఆమె స్ఫూర్తి అనుక్షణం మన వెన్నంటే ఉంటుందని, ఆమె చూపిన బాటలో నడవడమే ఆమెకు మనం అందించే నివాళి అంటూ వరుస ట్వీట్లలో చంద్రబాబు పేర్కొన్నారు.


More Telugu News