23 మందికి కరోనా అంటించి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. 15 గ్రామాల దిగ్బంధం!

  • జర్మనీ, ఇటలీ టూర్లను ముగించుకుని వచ్చిన  70 ఏళ్ల వ్యక్తి
  • 15 గ్రామాల్లో పర్యటించిన వైనం
  • కుటుంబంలోని 14 మందికి కరోనా పాజిటివ్
కరోనా వైరస్ కారణంగా పంజాబ్ లో మార్చి 18న ఒక వ్యక్తి మరణించారు. ఈయన ద్వారా కనీసం 23 మందికి కరోనా వైరస్ వ్యాపించిందని భావిస్తున్నారు. రాష్ట్రంలో నమోదైన 33 కేసుల్లో ఈయన ద్వారా సంక్రమించినవి 23 కావడం దురదృష్టకరం. 70 ఏళ్ల ఈ వ్యక్తి (గురుద్వారా పెద్ద) జర్మనీ, ఇటలీ టూర్లను ముగించుకుని మార్చి 6న ఢిల్లీకి తిరిగి వచ్చారు.

తర్వాత అక్కడి నుంచి పంజాబ్ కు చేరుకున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ తర్వాత ఆయన మార్చి 8 నుంచి 10వ తేదీ మధ్య ఆనంద్ పూర్ సాహిబ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత భగత్ సింగ్ నగర్ జిల్లాలోని తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యే సరికి కనీసం 100 మందిని కలిశారు. ఆయన, ఆయన ఇద్దరు స్నేహితులు కలసి కనీసం 15 గ్రామాలను సందర్శించారు.

మరోవైపు మృతుడి కుటుంబంలో 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో ఆయన మనవడు, మనవరాలు ఎంతో మందిని కలిశారు. దీంతో వీరంతా ఎవరెవరిని కలిశారో ట్రాక్ చేసే పనిలో అధికారులు పడ్డారు. 15 గ్రామాలను పూర్తిగా దిగ్బంధించారు. 


More Telugu News