తిరుమలలో మొదలైన ధన్వంతరీ యాగం... అఖండదీపంపై వదంతులు నమ్మవద్దన్న రమణ దీక్షితులు

  • రెండు రోజులు సాగనున్న ధన్వంతరీ యాగం
  • అఖండ దీపం ఆరిపోయిందని వదంతులు
  • అటువంటిదేమీ లేదన్న రమణ దీక్షితులు
లోక కల్యాణార్థం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ధన్వంతరీ యాగం జరుగనుంది. ఈ సందర్భంగా విశేష హోమాలు, పూర్ణాహుతి జరుగనుంది. పూర్ణాహుతి అనంతరం కుంభజలాన్ని జలాశయంలో కలుపుతారు. ఈ శక్తి సూర్యరశ్మి ద్వారా వాతావరణంలో కలుస్తుందని, ఆపై మేఘాల ద్వారా వాయు రూపంలోకి మారి అనారోగ్య కారకాలను నశించేలా చేస్తుందని పండితులు వ్యాఖ్యానించారు. ధన్వంతరీ యాగంలో భాగంగా సూర్య జపాలు, అష్ట దిక్పాలకులకు సంబంధించిన వేద మంత్రాలను పండితులు పారాయణం చేస్తున్నారు.

కాగా, తిరుమలలో భక్తులు లేక అఖండ దీపం ఆరిపోయిందన్న వదంతులు భక్తులను కలవరపెడుతున్న వేళ, ఈ ఉదయం మాజీ ప్రధానార్చకులు, ప్రస్తుత ఆగమ శాస్త్ర సలహాదారు రమణ దీక్షితులు స్పందించారు. స్వామివారికి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకూ అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రంలో తెలిపిన విధంగా నిత్యమూ స్వామికి అన్ని పూజలు, కైంకర్యాలూ జరుగుతున్నాయని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా భక్తులు ఇళ్లలోనే ఉంటూ స్వామివారిని పూజించాలని సూచించారు.


More Telugu News