బ్యాంకు రుణ గ్రహీతలకు ఆర్బీఐ ఊరట.. వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం
- దేశంలోని అన్ని రకాల బ్యాంకులకు వర్తింపు
- మార్చి ఒకటి నుంచి అమలు
- ఎటువంటి బకాయిలు వసూలు చేయవద్దని ఆదేశం
కరోనా కట్టడికి దేశ ప్రజలంతా పోరాడుతున్న సమయంలో ఆర్థికంగా వారికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో భారత ఆర్థిక రంగ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఊరటనిచ్చే ప్రకటన చేసింది. దేశంలోని అన్ని రకాల బ్యాంకుల నుంచి పొందిన రుణాల వాయిదాల (ఈఎంఐ) చెల్లింపుపై మూడునెలల మారటోరియం విధించింది. వాయిదాల చెల్లింపు తేదీతో సంబంధం లేకుండా మార్చి ఒకటి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని చెప్పింది.
దీనిపై ఆయా బ్యాంకులు తదుపరి ఉత్తర్వులు జారీచేస్తాయని పేర్కొంది. ఈ ఉత్తర్వులు అన్ని రకాల వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సూక్ష్మరుణ సంస్థలు, ప్రాంతీయ బ్యాంకులతో కలిపి), సహకార బ్యాంకులు, అఖిల భారత ఆర్థిక సంస్థలు, ఎన్ఎఫ్ బీసీ (గృహరుణాల సంస్థలు, సూక్ష్మరుణాల సంస్థలు)లకు వర్తిస్తాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
దీంతో రుణ గ్రహీతలు ఈ నెల నుంచి మూడు నెలలపాటు తమ రుణవాయిదాల సొమ్ము చెల్లింపునకు సంబంధించి ఖాతాలో నిల్వలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.