ఓవరాక్షన్ చేసిన పెరవలి ఎస్ఐపై డీజీపీ సస్పెన్షన్ వేటు
- స్వీయ నిర్బంధం కాలేదని తండ్రీ కొడుకులను చితక్కొట్టిన వైనం
- దీన్ని సమీపంలోని వారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్
- వైరల్ కావడంతో చర్యలు తీసుకున్న గౌతమ్ సవాంగ్
విధి నిర్వహణలో ఓవరాక్షన్ చేసిన పెరవలి ఎస్ఐపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సస్పెన్షన్ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో ఓ యువకుడు విదేశాల నుంచి వచ్చాడు. అతన్ని ఇంట్లోనే క్వారైంటైన్ (స్వీయ నిర్బంధం)లో ఉండాలని వైద్యాధికారులు సూచించారు.
అయితే అతను నిబంధనలు పక్కన పెట్టి బయటకు రావడంతో పెరవలి ఎస్ఐ కిరణ్ కుమార్ కోపోద్రిక్తుడయ్యారు. బయటకు వచ్చిన అతనిపై లాఠీచార్జి చేశారు. అక్కడే ఉన్న సదరు యువకుడి తండ్రిని కూడా చితకబాదాడు. దీన్ని సమీపంలోని వారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఇది కాస్తా వైరల్ అయి డీజీపీ దృష్టికి వెళ్లడంతో గౌతమ్ సవాంగ్ చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించాలి తప్ప దాడిచేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.