నాడు దేశాన్ని ఉర్రూతలూగించిన 'రామాయణ్'.. రేపటి నుంచి దూరదర్శన్ లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు!

  • 1987లో దూరదర్శన్ లో ప్రసారం
  • ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తొలి ఎపిసోడ్
  • తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు
33 ఏళ్ల క్రితం 1987లో దూరదర్శన్ లో ప్రసారమైన రామాయణ్ సీరియల్ దేశ ప్రజలను ఉర్రూతలూగించింది. మన తెలుగు ప్రజలు కూడా ఆ సీరియల్ కు నీరాజనం పలికారు. హిందీ అర్థం కాకపోయినా...  ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ... సీరియల్ టైమ్ కి టీవీల ముందు  వాలిపోయేవారు.  ఆ తర్వాత ఎన్నో చానల్స్ వచ్చి... ఎన్నో సీరియల్స్ ప్రసారమై, ప్రేక్షకాదరణ పొందాయి. కానీ, ఆనాటి  రామాయణ్ మాత్రం ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. మళ్లీ ఆ సీరియల్ ప్రసారమైతే బాగుండునని మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనిపించే ఉంటుంది. ఇప్పుడు ఆ కోరిక తీరబోతోంది. అవును. అలనాటి రామాయణ్ సీరియల్ ప్రేక్షకుల డిమాండ్ మేరకు మళ్లీ  ప్రసారం కాబోతోంది.

రేపు (శనివారం) రామాయణ్ తొలి ఎపిసోడ్  దూరదర్శన్ లో ప్రసారం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు... తిరిగి రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు సీరియల్ ప్రసారం అవుతుంది. ఈ వివరాలను కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ వెల్లడించారు.

రామాయణ్ సీరియల్ ను రామానంద సాగర్ నిర్మించారు. ఈ సీరియల్ లో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికిలియా, లక్ష్మణుడిగా సునిల్ లాహ్రి నటించారు.


More Telugu News