16 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది సామూహిక అత్యాచారం!

  • జార్ఖండ్ లోని దుంఖా జిల్లాలో ఘోరం
  • బాలికపై స్నేహితుడితో పాటు మరో ఎనిమిది మంది అత్యాచారం
  • రాత్రంతా అపస్మారక స్థితిలోనే ఉన్న బాధితురాలు
నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేసి కొన్ని రోజులు కూడా గడవలేదు. అయినా, కామాంధుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా జార్ఖండ్ లో మరో ఘోరం సంభవించింది. 16 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది పాశవికంగా సామూహిక అత్యాచారం జరిపారు. దుంఖా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వైయస్ రమేశ్ మాట్లాడుతూ, బాలికకు మాయమాటలు చెప్పిన దుండగులు ఆమెను పక్కన ఉన్న అడవిలోకి తీసుకెళ్లి, రేప్ చేశారని తెలిపారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేప్ చేసిన తొమ్మిది మందిలో ఒకరు ఆమె స్నేహితుడని... మిగిలిన వారు ఆమెకు తెలియదని  చెప్పారు. దుంఖా టౌన్ నుంచి ఆమెను గ్రామం సమీపం వరకు ఆమె స్నేహితులు ఇద్దరు బైక్ పై డ్రాప్ చేశారు. ఆ  తర్వాత గ్రామంలోకి తీసుకెళ్లమని మరో స్నేహితుడికి ఆమె ఫోన్ చేసింది. ఆ తర్వాత ఆమె స్నేహితుడు మరో వ్యక్తితో కలిసి బైక్ పై ఆమె వద్దకు వచ్చాడు.

పోలీసులు వాహనాలను  చెక్ చేస్తున్నారని... మరో షార్ట్ కట్ లో వెళ్దామని బాధితురాలికి చెప్పిన దుండగులు... ఆమెను పక్కనే ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ మరో ఏడుగురు ఉన్నారు. అందరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి  రోజు ఉదయం ఆమె స్పృహలోకి వచ్చింది.

ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో  చికిత్స పొందుతోందని...  అక్కడే ఆమె స్టేట్  మెంట్ తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చేపట్టారని చెప్పారు.


More Telugu News