కరోనాపై పోరుకు రూ. 100 కోట్లతో బజాజ్ గ్రూప్ నిధి
- పూణేలో ఆరోగ్య సంరక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి
- కార్మికులు, ఇల్లు లేని వారిని, వీధి పిల్లలను ఆదుకుంటామని ప్రకటన
- ‘కరోనా’ కట్టడికి ముందుకొస్తున్న కార్పొరేట్ సంస్థలు
కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అవసరార్థులను ఆదుకోవడం కోసం కార్పొరేట్ సంస్థలు, సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో బజాజ్ గ్రూప్ కూడా చేరింది. పూణేలో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కావాల్సిన ఆరోగ్య సంరక్షణ, మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి రూ. 100 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అదే విధంగా కార్మికులు, ఇల్లు లేని వారు, వీధి పిల్లలకు తక్షణ సాయం చేయనున్నట్టు ఈ సంస్థ చైర్మన్ రాహుల్ బజాజ్ తెలిపారు.