ఢిల్లీలో ఆ డాక్టర్​ను కలిసిన 800 మందికి క్వారంటైన్

  • ఈశాన్య ఢిల్లీలో మొహల్లా క్లినిక్ వైద్యుడికి కరోనా
  • ఆయన భార్య, కుమార్తెకు కూడా సోకినట్టు నిర్ధారణ
  • ఆ వైద్యుడిని కలిసిన వారిని గుర్తించిన వైద్య శాఖ
ఢిల్లీలో ఓ వైద్యుడికి కరోనా సోకినట్టు తేలడం కలకలం సృష్టించింది. ఈశాన్య ఢిల్లీ మౌజ్‌పూర్ ప్రాంతంలో ఉన్న మొహల్లా క్లినిక్‌కు చెందిన సదరు వైద్యుడితో కాంటాక్ట్ అయిన 800 మందిని గుర్తించారు. వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచామని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ తెలిపారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్‌లో పని చేస్తున్న 49 ఏళ్ల సదరు వైద్యుడికి ఎవరి ద్వారా వైరస్ సోకిందో ఇంకా తెలియలేదు. ఆయన భార్య, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఢిల్లీ ప్రభుత్వం ఉలిక్కిపడింది.

డాక్టర్ కావడంతో ప్రతి రోజు చాలా మందిని ఆయన ముట్టుకునే అవకాశం ఉందని, దానివల్ల మరెందరికో వైరస్‌ సోకుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. వెంటనే రంగంలోకి దిగిన ఢిల్లీ వైద్య శాఖ ఈ నెల 12 నుంచి 18వ తేదీల మధ్య ఆ డాక్టరును ఎంతమంది కలిశారో, ఆ క్లినిక్‌కు ఎంత మంది వచ్చారో గుర్తించే పనిలో పడింది. ఈ క్రమంలో మొత్తం 800 మందిని గుర్తించింది. వారందరినీ 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచింది. అయితే, వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.


More Telugu News