కరోనా వైరస్ సీజనల్‌ వ్యాధి కాగలదు: అమెరికా శాస్త్రవేత్త

  • శీతాకాలం రాబోతున్న దక్షిణాది దేశాల్లోకి వైరస్
  • వ్యాప్తి ఎక్కువయితే రెండో దశలోకి ప్రవేశించినట్టు లెక్క
  • వ్యాక్సిన్‌ను త్వరగా అభివృద్ధి చేయాలని సూచన  
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇకపై సీజనల్ వ్యాధిగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ శాస్త్రవేత్త అభిప్రాయపడుతున్నారు. అలా జరిగితే నష్టం అధికంగా ఉంటుందని, వెంటనే వ్యాక్సిన్‌తో పాటు సమర్థవంతమైన చికిత్స విధానాలను కనుగొనాలని చెప్పారు.
 
ప్రస్తుతం శీతాకాలం మొదలవబోతున్న ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంతోపాటు, దక్షిణాది దేశాల్లో వైరస్‌ వ్యాప్తిని తాము గుర్తించామని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్‌’లో అంటు వ్యాధులపై పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న ఆంథోనీ ఫాసి తెలిపారు. ఒకవేళ ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటే మాత్రం కరోనా రెండో దశలోకి ప్రవేశించినట్టు అర్థం చేసుకోవాలన్నారు. అప్పుడు వ్యాక్సిన్‌ను త్వరగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకోసం వేగంగా పరీక్షలు నిర్వహించి, వైరస్ రెండో దశలోకి ప్రవేశించే సమయానికి వ్యాక్సిన్‌ను సిద్ధంగా ఉంచితేనే భారీ ముప్పును నిరోధించగలమని అన్నారు.

వేసవితో పోల్చితే చలికాలంలో ఈ వైరస్ అధికంగా వృద్ధి చెందుతుందని ఇటీవల చైనాకు చెందిన రీసెర్చ్ పేపర్ అభిప్రాయపడింది. ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించాల్సి ఉన్నప్పటికీ.. ఫాసి సూచనలు దాన్ని బలపరుస్తున్నాయి.

ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ ను కనుగొనే ప్రక్రియలో అమెరికా, చైనా దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ రెండు దేశాలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు ప్రస్తుతం మనుషులపై ప్రయోగించే దశలోకి వచ్చాయి. ఏడాది నుంచి ఏడాదిన్నరలోపు పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే, వైరస్ బారిన పడిన వారికి తగిన చికిత్స అందించేందుకు జరుగుతున్న ప్రయోగాలు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి. కొన్ని కొత్త డ్రగ్స్‌తో పాటు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కూడా చికిత్సలో వాడుతున్నారు.


More Telugu News