బ్రిటన్ రాజకుటుంబాన్నీ తాకిన కరోనా.. ప్రిన్స్ చార్లెస్‌కు పాజిటివ్!

  • రోగ లక్షణాలు పెద్దగా ఏమీ లేవన్న రాజకుటుంబం
  • చార్లెస్ భార్య కెమిల్లాకు నెగటివ్
  • స్కాట్లాండ్‌లో ఇద్దరూ సెల్ఫ్ క్వారంటైన్‌లో
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు బ్రిటన్ రాజ కుటుంబాన్నీ తాకింది. 71 ఏళ్ల ప్రిన్స్ చార్లెస్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. అయితే, రోగ లక్షణాలు అంత తీవ్రంగా ఏమీ లేవని, చిన్నచిన్న సమస్యలు మినహా ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం ఆయన ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నట్టు పేర్కొంది.

ఇక ప్రిన్స్ చార్లెస్ భార్య కెమిల్లాకు జరిపిన పరీక్షల్లో మాత్రం నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. చార్లెస్ ఇటీవల అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ఏ సందర్భంలో ఈ వైరస్ ఆయనకు సోకి ఉంటుందనే విషయాన్ని ఇప్పటికిప్పుడు చెప్పలేమని అధికారులు తెలిపారు. చార్లెస్, కెమిల్లా దంపతులు ప్రస్తుతం స్కాట్లాండ్‌లో సెల్ఫ్‌క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, యూకేలో ఇప్పటి వరకు 8077 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, 422 మంది మృత్యువాత పడ్డారు.


More Telugu News