కాబూల్ లోని గురుద్వారాలో ప్రార్థనలు చేస్తున్న సిక్కులపై ఉగ్రదాడి.. 11 మంది దుర్మరణం

  • ప్రార్థనలో 150 మంది సిక్కులు 
  • కాల్పులు తమ పనేనన్న ఐసిస్
  • తీవ్రంగా ఖండించిన భారత్
కాబూల్ మరోమారు రక్తమోడింది. సిక్కుల ప్రార్థనా మందిరమైన గురుద్వారాలో ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక షోర్ బజార్‌లో ఉన్న గురుద్వారాలో ఈ ఉదయం సిక్కులు ప్రార్థనలు చేస్తుండగా సాయుధులైన కొందరు ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారు. ప్రార్థనలో ఉన్నవారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దాంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

దాడి సమయంలో గురుద్వారాలో 150 మంది సిక్కులు ప్రార్థనలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాల్పులు జరిపింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐసిస్) ప్రకటించింది. కాగా, గురుద్వారాపై ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో పోరాడుతున్న వేళ ఇలాంటి దాడులు క్రూరమైనవని ఆగ్రహం వ్యక్తం చేసింది.


More Telugu News