యువతీయువకుల ఆందోళనతో దిగొచ్చిన పంజాగుట్ట పోలీసులు.. స్వగ్రామాలకు వెళ్లేందుకు పాసుల మంజూరు

  • హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ యువతీయువకులపై ఒత్తిడి
  • ఎలా వెళ్లాలంటూ పోలీస్  స్టేషన్ ఎదుట ఆందోళన
  • చెక్‌పోస్టుల వద్ద అడ్డుకోకుండా పాసులు జారీ చేశామన్న డీసీపీ
హైదరాబాద్‌లోని అమీర్‌పేట, పంజాగుట్ట సహా సమీప ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంటున్న యువతీయువకుల ఆందోళనకు పోలీసులు దిగొచ్చారు. వారు ఎటువంటి ఆటంకం లేకుండా స్వగ్రామాలకు వెళ్లేందుకు పాసులు జారీ చేశారు. మూడువారాలపాటు దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లోని ఆయా హాస్టళ్ల యజమానులు యువతీ యువకులపై ఒత్తిడి తీసుకొచ్చారు.

దీంతో ఆందోళన చెందిన యువతీయువకులు ఈ రోజు ఆందోళనకు దిగారు. బస్సులు, రైళ్లు అన్నీ బంద్ ఉంటే ఇప్పటికిప్పుడు తామెక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన పోలీసులు వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వగ్రామాలకు వెళ్లేందుకు వీలుగా పాసులు మంజూరు చేశారు. చెక్‌పోస్టుల వద్ద వారిని అడ్డుకోకుండా ఈ పాసులు మంజూరు చేసినట్టు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.


More Telugu News