ఇప్పటి వరకైతే ఇండియా చర్యలు భేష్... తేడా వస్తే మాత్రం పరిస్థితి దారుణాతి దారుణం: హెచ్చరించిన మేధావులు

  • వైరస్ వ్యాప్తి నివారణకు చేస్తున్న కృషి ప్రశంసనీయం
  • పది వేల మందికి 7 బెడ్లు మాత్రమే అందుబాటులో
  • మరో దశ దాటితే ప్రమాదకరమన్న కోవ్-ఇండ్-19 బృందం
కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇండియా చేస్తున్న కృషి, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయమని కోవ్‌-ఇండ్‌-19 భారత మేధావులు, డేటా సైంటిస్టుల సముదాయం కితాబిచ్చింది. అయితే, కేసుల వ్యాప్తిని ఈ దశలోనే అరికట్టాల్సి వుందని పేర్కొంది. పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నా, కరోనా పరీక్షలు తరచూ నిర్వర్తించే విషయంలో మాత్రం విఫలమవుతోందని అభిప్రాయపడింది. ఈ నెల 18 నాటికి కేవలం 11,500 పరీక్షలు మాత్రమే ఇండియాలో జరిగాయని నిపుణుల బృందం గుర్తు చేసింది.

కరోనా వైరస్ ఇప్పుడున్న పరిస్థితుల్లోనే విస్తరిస్తే, మే రెండోవారం దాటే సరికి 13 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వారు అంచనా వేశారు.. ఇప్పటివరకూ వాక్సిన్ గానీ, మందుగానీ లభించని కరోనాను రెండు, మూడవ దశల్లోనే అణచివేయకుంటే, ఇండియాలో పరిస్థితి దారుణాతి దారుణంగా మారుతుందని హెచ్చరించారు.

ఇప్పటికే యూఎస్, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా నిదానంగా విస్తరించే దశ దాటి విస్పోటనం చెందిందని, ఇండియాలోనూ ఈ పరిస్థితి రాకుండా చూడాలంటే, మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, వైరస్ తో వణికిపోతున్న దేశాలతో పోలిస్తే, ఇక్కడ జనాభాకు తగినన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని మరచిపోరాదని వారు హెచ్చరించారు. ఇండియాలో ప్రతి పదివేల మందికి 7 బెడ్లు మాత్రమే ఉన్నాయని, కరోనా మూడో దశకు చేరితే ఇవి ఏ మాత్రమూ సరిపోవని తెలిపారు.


More Telugu News