అమెరికాలో మరణమృదంగం... ఒక్కరోజులో 10 వేల కొత్త కేసులు!

  • మరింత వేగంగా విస్తరిస్తున్న వైరస్
  • ఒక్కరోజులో 130 మంది మృతి
  • అక్రమ నిల్వలపై కఠిన చర్యలు ఉంటాయన్న ట్రంప్
అమెరికాలో కరోనా వైరస్ మరణమృదంగాన్నే సృష్టిస్తోంది. గడచిన 24 గంటల వ్యవధిలో వైరస్ వ్యాప్తి తీవ్రత మరింతగా పెరగగా, పది వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యూఎస్ లో వైరస్ బారినపడిన వారి సంఖ్య 49,594కు చేరింది. మంగళవారం ఒక్క రోజే 130 మంది మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య 622కి చేరుకుంది. వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 16,961 మంది మరణించగా, వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 4 లక్షలను దాటింది.

ఇదిలావుండగా, మాస్క్ లు, శానిటైజర్లు ఇతర మందులను అక్రమంగా నిల్వ చేస్తే, కఠిన చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్‌ హెచ్చరించారు. ఔషధాలు, మాస్క్ లను అధిక ధరలకు విక్రయిస్తే, శిక్ష తప్పదన్నారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న న్యూయార్క్‌ ప్రాంతంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

యూఎస్ లో వైరస్ బారినపడిన ప్రతి ఇద్దరిలో ఒకరు న్యూయార్క్ కు చెందిన వారే కావడం గమనార్హం. ఈ మహానగరంలో 24 గంటల వ్యవధిలో 5,085 కొత్త కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్‌ సిటీ, మెట్రో ఏరియా, న్యూజెర్సీ, లాండ్‌ ఐలాండ్‌ తదితర ప్రాంతాల్లో ప్రతి వెయ్యిమంది జనాభాలో ఒకరికి వ్యాధి సోకిందని వైట్‌ హౌస్‌ కరోనా టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసర్ డెబ్రా ఎల్‌ బ్రిక్స్‌ తెలిపారు. ఈ ప్రాంతానికి తగినన్ని మందులు, ఇతర పరికరాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు. 


More Telugu News