కరోనా వ్యాప్తికి త్వరలోనే తెరపడుతుంది: నోబెల్ విజేత, జీవ భౌతిక శాస్త్రవేత్త లైఖేల్ లెవిట్

  • దశలవారీగా తగ్గుముఖం పడుతుంది
  • శాస్త్రవేత్తల అంచనాల కన్నా ముందుగానే
  • లాస్ ఏంజిల్స్ టైమ్స్ తో లెవిట్
కరోనా మహమ్మారి వ్యాప్తి నెమ్మదిస్తుందని, అది దశలవారీగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని 2013లో రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి విజేత, ప్రఖ్యాత జీవ భౌతిక శాస్త్రవేత్త మైఖేల్‌ లెవిట్‌ అంచనా వేశారు. ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తున్న వైరస్ వ్యాప్తికి త్వరలోనే తెరపడుతుందని ఆయన జోస్యం చెప్పారు.

తాజాగా 'లాస్‌ఏంజిల్స్‌ టైమ్స్‌'తో మాట్లాడిన ఆయన, చైనా తరహాలోనే అమెరికా కూడా త్వరలోనే కరోనా నుంచి విముక్తి సాధిస్తుందని, ప్రస్తుత శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న సమయం కంటే ఇది ముందే జరుగుతుందన్న ఆశాభావాన్ని లెవిట్ వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి, ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులను నిశితంగా అధ్యయనం చేస్తున్న లెవిట్, భయాందోళనలను అధిగమించి, సామాజిక దూరం పాటిస్తే, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం సులువేనని అన్నారు.

కాగా, వైరస్ పై లెవిట్ వేసిన అంచనాలు ఎన్నో నిజమయ్యాయి. చైనాలో సుమారు 80 వేల కేసులు నమోదవుతాయని, 3,250 మరణాలు సంభవిస్తాయని లెవిట్‌ ఫిబ్రవరిలో వేసిన అంచనాలు వాస్తవ గణాంకాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. చైనాలో 80,298 కేసులు, 3245 మరణాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

78 దేశాల నుంచి నిత్యమూ కొత్తగా నమోదవుతున్న కేసులను విశ్లేషిస్తున్నామని, ఇప్పటికే వైరస్‌ వ్యాప్తి వేగం కొంత తగ్గిందని ఆయన అన్నారు. మొత్తం కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోలేదని, కొత్తగా నమోదయ్యే కేసుల్లో తగ్గుదలను పరిశీలిస్తున్నామని తెలిపిన ఆయన, సంఖ్యా పరంగా కనిపిస్తున్న కేసులు, ఆందోళనకరంగానే ఉన్నా, వైరస్‌ వ్యాప్తి బలహీనపడుతున్నదనేందుకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని ఆయన అన్నారు.

సామాజిక దూరంతో పాటు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ ను అందుబాటులోకి తీసుకురావడం అత్యంత కీలకమని లెవిట్ వ్యాఖ్యానించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన సెలబ్రిటీలపై ఫోకస్‌ చేయడాన్ని మీడియా మానివేయాలని, మీడియా కారణంగా ప్రజలు అనవసరంగా భయాలకు లోనవుతున్నారని ఆయన అన్నారు.


More Telugu News