విదేశాల నుంచి వచ్చేవాళ్లు పరీక్షలు చేయించుకోకపోతే కేసులు తప్పవు: ఏపీ డీజీపీ

  • విదేశాల నుంచి వచ్చేవాళ్లు వివరాలు తెలపడంలేదన్న డీజీపీ
  • అలాంటివారిపై కేసులు పెడతామని హెచ్చరిక
  • మున్ముందు ఆంక్షలు పెరిగే అవకాశం ఉందని వెల్లడి
ఏపీలో కరోనా మహమ్మారిపై సర్కారు తీవ్ర పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో ప్రధానంగా విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారిపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘాటుగా స్పందించారు.

విదేశాల నుంచి వచ్చేవాళ్లు తమ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారని, అలాంటి వారిపై కేసులు పెడతామని, పాస్ పోర్టులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. జిల్లా సరిహద్దుల్లోనూ ఆంక్షలు విధిస్తున్నామని చెప్పారు. కరోనా తీవ్రత అనుసరించి ప్రతిరోజూ ఆంక్షలు పెరిగే అవకాశం ఉందని డీజీపీ తెలిపారు.

అత్యవసర సమయాల్లో కూడా కారులో ఇద్దరినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 188, 298 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని వివరించారు. లాక్ డౌన్ రెండో రోజు కూడా మంచి స్పందన వచ్చిందని, కరోనాపై ప్రజల్లో అవగాహన పెరగడమే కాకుండా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని తెలిపారు.

కరోనా నియంత్రణపై విదేశాల నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలని, ఉదయం, సాయంత్రం ప్రత్యేక సమయాల్లోనే నిత్యావసరాల కొనుగోళ్లు జరపాలని సూచించారు. తప్పనిసరి అయితేనే బయటికి రావాలని, వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని స్పష్టం చేశారు. అవసరం లేకపోయినా బయట తిరుగుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నామని అన్నారు.


More Telugu News