విదేశాల నుంచి వచ్చిన వాళ్లు దీన్ని అవమానంగా భావించొద్దు: ఏపీ మంత్రి పేర్ని నాని

  • విదేశాల నుంచి వచ్చినవారికి క్వారంటైన్ తప్పనిసరన్న పేర్ని నాని
  • ఇంటర్ పరీక్షల మూల్యాంకనం నిలిపివేస్తున్నట్టు వెల్లడి
  • ఎంసెట్, ఈసెట్, ఐసెట్ దరఖాస్తు గడువు పెంచుతున్నట్టు నిర్ణయం
కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. మనవాళ్లు విదేశాల్లో ఉన్నారంటే గర్వకారణమేనని, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు స్వదేశానికి వస్తే తప్పకుండా 14 రోజుల క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేశారు. దీన్ని అవమానంగా భావించాల్సిన అవసరం లేదని, వారు సొంత ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వ సూచనల ప్రకారం ఈ నెల 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు రివిజన్ చేసేందుకు సమయం దొరుకుతుందని అన్నారు. ఈ నెల 31 తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది విద్యాశాఖ ప్రకటిస్తుందని తెలిపారు. ఎంసెట్ కు ఏప్రిల్ 5 వరకు, ఈసెట్, ఐసెట్ లకు కు ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తున్నామని వివరించారు.

ఇంటర్ పేపర్లు దిద్దే ప్రక్రియను కూడా వాయిదా వేశామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ పరిస్థితులు ఉన్నందున గుంటూరు మిర్చి యార్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తెలిపారు. రైతు బజార్లు యథాతథంగా నడుస్తాయని, రద్దీని బట్టి నగరాలు, పట్టణాల్లో అనేక ప్రాంతాల్లో కూరగాయలు విక్రయించే ఏర్పాట్లు చేస్తామని వివరించారు.


More Telugu News