అద్దె ఇంట్లోంచి వెళ్లగొడుతున్నారన్న వైద్యుడు.. చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌కు కోన వెంకట్‌ ట్వీట్

  • వరంగల్‌ లో చాలా మంది వైద్యులు అద్దె ఇళ్లలో ఉంటున్నారన్న వైద్యుడు
  • తమను 'చెత్త' మనుషులు అంటూ ఓ ఓనర్ కించపర్చాడని ఆవేదన
  • ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లిన కోన వెంకట్
వరంగల్‌ నగరంలోని చాలా మంది వైద్యులు అద్దె ఇళ్లలో ఉంటున్నారని, అయితే వారిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని యజమానులు ఒత్తిడి తెస్తున్నారని వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వైద్యులకు అది సోకి తమకూ సోకుతుందన్న భయంతో ఇళ్ల యజమానులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

తమను 'చెత్త' మనుషులు అంటూ ఓ ఓనర్ కించపర్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది వైద్యులు తమ లగేజీతో రోడ్లపైకి వచ్చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. తాము ప్రజల కోసం కష్టపడుతుంటే వారు తమకు కనీసం ఉండడానికి ఇళ్లు కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని గుర్తించిన సినీ రచయిత కోన వెంకట్.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. 'ఆయన చెప్పిన విషయాలు నిజమే అయితే వెంటనే చర్యలు తీసుకోవాలి.. వైద్యులను రక్షించాలి. వారు తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టి పనిచేస్తుంటారు' అని కేటీఆర్‌ను కోరారు.


More Telugu News