వైరస్ భయం అలా వుంది మరి... ముగిసిన షహీన్ బాగ్ సీఏఏ వ్యతిరేక ఆందోళనలు!

  • 101 రోజుల పాటు సాగిన ఆందోళనలు
  • ఈ ఉదయం భారీ ఎత్తున చేరుకున్న బలగాలు
  • బలవంతంగా నిరసనకారుల తొలగింపు
  • తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేంద్రం ఆమోదించిన తరువాత, ఢిల్లీలోని షహీన్ బాగ్ ప్రాంతంలో మొదలై, 101 రోజులుకు పైగా సాగిన ఆందోళనలకు తెరపడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయంతో ఇప్పటికే పలువురు నిరసనకారులు, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయగా, మిగిలిన ఉద్యమకారులను పోలీసులు ఈ ఉదయం బలవంతంగా పంపించి వేశారు.

ఈ ఉదయం ఆగ్నేయ ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ ఆర్‌పి మీనా నేతృత్వంలో నిరసన స్థలానికి భారీఎత్తున చేరుకున్న పోలీసులు, టెంట్లు, ఇతర సామగ్రిని తొలగించే పనులు చేపట్టగా, కొందరు అడ్డుకున్నారు. ఈ సమయంలో వారిని అరెస్ట్ చేశామని, వారిలో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతంలో నెలాఖరు వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించిన ఉన్నతాధికారులు, ఢిల్లీ అధికారుల సహకారంతో ఈ ప్రాంతాన్ని పరిశుభ్రం చేస్తున్నామని, ఇదే విధంగా నగరంలోని జఫ్రాబాద్, టర్క్ మన్ గేట్ ప్రాంతంలో జరుగుతున్న నిరసనల్లో భాగమైన ఆందోళనకారులనూ పంపించి వేశామని తెలిపారు.

మరోపక్క, ఇప్పటివరకూ ఢిల్లీలో 30కి పైగా కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు చనిపోయారు. ఇప్పటికే ప్రజా రవాణా స్తంభించిపోయింది. సరిహద్దులు మూసివేయడం జరిగింది. నిత్యావసరాలు మినహా మరే దుకాణాలూ తెరిచేందుకు అనుమతి లేదు.


More Telugu News