పెట్రోల్ పై రూ. 18 వరకూ బాదుడు... చర్చ లేకుండానే బిల్లును ఆమోదింపజేసుకున్న ఎన్డీయే సర్కారు!

  • ఇప్పటికే కనిష్ఠానికి పడిపోయిన క్రూడాయిల్ ధర
  • కేంద్ర ఖజానాకు తగ్గిన రాబడి
  • ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి
కేంద్ర ఖజానాకు రాబడిని పెంచుకునే మార్గాలపై దృష్టి సారించిన ఎన్డీయే సర్కారు, ప్రత్యేక పరిస్థితుల్లో లీటరు పెట్రోల్ పై రూ. 18 వరకూ, డీజిల్ పై రూ. 12 వరకూ ఎక్సైజ్ సుంకాలను పెంచుకునేలా చట్ట సవరణ చేసింది. ఈ సవరణను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించగా, లోక్‌ సభలో ఎటువంటి చర్చ జరగకుండానే ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. ఇంతకుముందు పెట్రోల్‌ పై రూ.10, డీజిల్‌ పై రూ. 4 వరకు మాత్రమే ఎక్సైజ్‌ సుంకం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి చట్ట పరంగా అవకాశం ఉండేది.

ఇటీవలి కాలంలో నెలకొన్న అంతర్జాతీయ అనిశ్చితి క్రూడాయిల్ మార్కెట్ ను కుదేలు చేశాయి. ఇప్పటికే బ్యారల్ ముడి చమురు ధర 30 డాలర్ల దిగువకు పడిపోయింది. చమురు ధరలు కనిష్ఠ స్థాయులకు చేరడంతో, కేంద్ర ఖజానాకు ఆదాయం తగ్గింది. దీంతో ఈ నెల 14న పెట్రోల్, డీజిల్ పై రూ. 3 చొప్పున సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ఈ చర్యతో రూ. 39 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ఇదే సమయంలో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉండటంతో, భవిష్యత్తులోనూ ఎక్సైజ్ సుంకాలను పెంచుకునే వెసులుబాటు తమ వద్ద ఉంచుకునేందుకే కేంద్రం ఈ చట్ట సవరణను తెరపైకి తెచ్చింది.


More Telugu News