కరోనా ఉన్నా, లేకున్నా 'క్లోరోక్విన్'ను కొనేస్తున్న జనం... గుండెపోటు ముప్పు వుందంటున్న డాక్టర్లు!

  • క్లోరోక్విన్ కోసం ఎగబడుతున్న ప్రజలు 
  • వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి
  • హెచ్చరించిన గాంధీ వైద్యులు
కరోనా బాధితులు, అనుమానితులకు, వైద్య సేవలు అందించే వారు, ఈ వైరస్ లక్షణాలు లేకపోయినా మలేరియా చికిత్సకు వినియోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను తీసుకోవచ్చని, రోగుల బంధువులు కూడా ముందు జాగ్రత్తగా వాడవచ్చని ఐసీఎంఆర్ నుంచి వెలువడిన ప్రకటన, క్లోరోక్విన్ టాబ్లెట్లకు యమ డిమాండ్ ను తీసుకొచ్చింది. దీంతో ప్రజలు వేలంవెర్రిగా మెడికల్ షాపులపై పడి, క్లోరోక్విన్ టాబ్లెట్లను తెగ కొనేస్తున్నారు.

దీంతో స్పందించిన వైద్య విభాగం ఉన్నతాధికారులు, ఈ మాత్రలను వైద్యుల సూచన మేరకే వాడాలని, లేకుంటే పెను నష్టం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు వైద్యుల సూచన లేకుండా క్లోరోక్విన్ టాబ్లెట్స్ వాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించిన గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు మీడియాకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

తెలంగాణలో ఈ మాత్రలకు డిమాండ్ పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్నవారే వీటిని వాడాలని, సొంతంగా వినియోగిస్తే, గుండెపోటు ముప్పు ఒక్కసారిగా పెరిగిపోతుందని అన్నారు. ఇతర శారీరక రుగ్మతలూ బాధిస్తాయని హెచ్చరించారు. మెడికల్ షాపుల యజమానులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని విక్రయించరాదని సూచించారు.


More Telugu News