కరోనా నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడొచ్చు: ఐసీఎంఆర్

  • 15 ఏళ్లలోపు చిన్నారులకు వేయకూడదు
  • కరోనా బాధితులకు సేవలు అందించే వైద్య సిబ్బంది కూడా వేసుకోవాలి
  • తొలి రోజు రెండుసార్లు 400 మిల్లీగ్రాములు వేసుకోవాలి
కరోనా భయంతో అల్లాడుతున్న వారికి ఇది శుభవార్తే. ఈ మహమ్మారి బారి నుంచి తప్పించుకునేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ సమర్థంగా పనిచేస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా వైరస్‌పై తాము ఏర్పాటు చేసిన జాతీయ బృందం దీనిని సిఫారసు చేసినట్టు పేర్కొంది. దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వివరించింది. దీని వాడకానికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

కరోనా బాధితులకు, అనుమానితులకు, వైద్య సేవలు అందించే వారిలో కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వొచ్చని తెలిపింది. కరోనా రోగుల బంధువులు కూడా తీసుకోవచ్చని పేర్కొంది. అయితే, దీనిని సంబంధిత వైద్యుల సూచన మేరకే వేసుకోవాలని హెచ్చరించింది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తున్న సమయంలో ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.

వైద్య సేవలు అందిస్తున్న వారు తొలి రోజు రెండుసార్లు 400 మిల్లీగ్రాముల చొప్పున వాడాలని, ఆ తర్వాత ఏడు వారాలపాటు వారానికి ఒకసారి 400 ఎంజీ భోజనంతో కలిపి తీసుకోవాలని సూచించింది. రోగులతో కలిసి ఉంటున్న కుటుంబ సభ్యులు తొలి రోజు రెండుసార్లు 400 మిల్లీగ్రాములు, ఆ తర్వాత మూడు వారాలపాటు వారానికి 400 ఎంజీ చొప్పున భోజనంతో పాటు ఈ మందు తీసుకోవాలని వివరించింది. అయితే, 15 ఏళ్లలోపు చిన్నారుల్లో మాత్రం కోవిడ్ ముందస్తు నివారణ కోసం ఈ ఔషధాన్ని ఉపయోగించకూడదని హెచ్చరించింది.


More Telugu News