కిలో టమాటా రూ.100... వంకాయ రూ.80కి చేరిన వైనం.. మండిపడుతున్న ప్రజలు

  • హైదరాబాద్‌, నిజామాబాద్‌, నల్లగొండలో దారుణం
  • కూరగాయల ధరలు పెంచేసిన వ్యాపారులు
  • కఠిన చర్యలు తీసుకుంటామన్న తెలంగాణ సర్కారు 
తెలంగాణలో కూరగాయల వ్యాపారులు ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ధరలు పెరిగిపోతాయన్న అపోహ ప్రజల్లో నెలకొంది. దీంతో అత్యాశతో వెంటనే మార్కెట్లలోకి వెళ్లి నిత్యావసర సరుకులు కొనుక్కుంటున్నారు. వారి హడావుడే ఆసరాగా వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు.

కూరగాయల ధరలను అమాంతం పెంచేశారు. వీటిపై అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌, మోహదీ పట్నం రైతు బజార్‌ల్లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. టమాటా కిలో ధర నిన్నటి వరకు రూ. 8గా ఉంది. ఈ రోజు వ్యాపారులు కిలో రూ.100కి అమ్ముతున్నారు.

వంకాయ నిన్నటి వరకు కిలో రూ.15 ఉండగా ఈ రోజు రూ. 80కి, మిర్చి కిలో రూ. 25గా ఉండగా ఇప్పుడు రూ. 90కి అమ్ముతున్నారు. అలాగే, అన్ని కూరగాయల ధరలు పెంచేశారు. హైదరాబాద్‌లోనే కాదు నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ ఇటువంటి పరిస్థితులే వినియోగదారులకు ఎదురవుతున్నాయి. ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.


More Telugu News