ప్రేమ జంటకు పెళ్లి కష్టాలు...మూడుసార్లు వాయిదా పడిన వివాహ ముచ్చట!
- 2018, మే 20న జరగాల్సిన పెళ్లి
- నిఫా వైరస్ వ్యాప్తితో బ్రేక్
- వరదల కారణంగా 2019లో, కరోనా కారణంగా ఈ నెలలో పెళ్లి వాయిదా
ప్రేమ బాసలు చేసుకున్నారు. మనసు ఇచ్చిపుచ్చుకున్నారు. జీవితాన్ని పంచుకోవాలని, జీవన మాధుర్యాన్ని ఆస్వాదించాలని కలలుగన్నారు. పెళ్లి పీటలెక్కి ఒక్కటవుదామనుకునే సరికి అనుకోని అవాంతరాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండేళ్ల కాలంలో మూడుసార్లు ముహూర్తం నిర్ణయించినా పెళ్లితంతు పూర్తికాకపోవడంతో ఆ ప్రేమ జంటను నిరాశ ఆవహిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని ఎరాన్హీపాలన్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ చంద్రన్(26), సాండాసంతోష్ (23)లు మంచి స్నేహితులు. స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఊహల రెక్కలను విప్పుకుని జీవిత శిఖరాలను చేరుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుదామనుకున్న వారి ప్రయత్నానికి ముచ్చటగా మూడోసారి విఘ్నం ఎదురైంది.
రెండు రోజుల క్రితం జరగాల్సిన వీరి పెళ్లి కరోనా వైరస్ సమస్య కారణంగా వాయిదా పడింది. ఇలా వాయిదాపడడం తొలిసారి అయ్యుంటే వీరు అంతగా బాధపడేవారు కారేమో. 2018 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు ముహూర్తం నిర్ణయిస్తే ఏదో కారణంగా తప్పిపోయాయి. తొలుత 2018 మే 20న వీరి పెళ్లికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. అప్పట్లో నిఫా వైరస్ రాష్ట్రాన్ని చుట్టుముట్టడం, 17 మంది చనిపోవడంతో ఆ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం సరికాదని వాయిదా వేసుకున్నారు.
ఏడాది తర్వాత కేరళీయుల సంవత్సరాది అయిన ఓనం పండుగ రోజున పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. సరిగ్గా పెళ్లి రోజు దగ్గరయ్యేసరికి రాష్ట్రాన్ని ఆకస్మిక వరదలు చుట్టుముట్టాయి. భారీ వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం కావడంతో వీరి పెళ్లి మరోసారి వాయిదా పడింది. తాజాగా ఈనెల 20న పెళ్లి చేసుకోవాలని ముచ్చటగా మూడోసారి ముహూర్తం నిర్ణయించారు.
ఈసారి కచ్చితంగా తమ వివాహం పూర్తవుతుందని కలలుగన్న ఆ యువ జంట ఆశల పై 'కరోనా' వైరస్ నీళ్లు చల్లింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంటు రోగం ప్రబలుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీరు తమ పెళ్లిని మరోసారి వాయిదా వేసుకున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో పెళ్లిపీటలు ఎక్కాలనుకుంటున్న ఈ జంట ముచ్చట అప్పుడైనా తీరాలని ఆశిద్దాం.