ఏపీ ఉద్యోగులకు సర్కారు తీపి కబురు : వారంపాటు 'వర్క్‌ ఫ్రమ్ హోం' అవకాశం

  • తొలి వారం సగం మంది ఉద్యోగులకు అవకాశం
  • మిగిలిన సగం మందికి తర్వాత వారం
  • ఆదేశాలు జారీ చేసిన సీఎస్‌ నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా ‘వర్క్‌ ఫ్రమ్ హోం’ సదుపాయం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సగం సగం(50/50) ప్రాతిపదికన అన్ని విభాగాల్లోని ఉద్యోగులను రెండు భాగాలుగా విభజించి ఒక వారం సగం మందికి, మిగిలిన సగం మందికి తర్వాత వారం ఇంటి నుంచి పనిచేసుకునేందుకు అవకాశం కల్పించాలని తన ఉత్తర్వుల్లో సూచించింది.

సచివాలయంలో పనిచేస్తున్న సెక్షన్‌ ఆఫీసర్‌ మొదలుకొని కింది స్థాయి ఉద్యోగుల వరకు, జిల్లాలోని హెచ్‌ఓడీలు, ఇతర కార్యాలయాల సిబ్బందిని రెండు భాగాలుగా విభజించి ఈ ఉత్తర్వులను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఆదేశాలు జారీ చేశారు.

పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వ సలహాదారులుగా, చైర్‌పర్సన్‌లుగా, కన్సల్టెంట్‌లుగా పనిచేస్తున్న వారు హెచ్‌ఓడీ అనుమతితో ‘వర్క్‌ ఫ్రమ్ హోం’ అనుమతి అవకాశం పొందవచ్చని సీఎస్‌ తన ఉత్తర్వుల్లో సూచించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రొటేషన్ పద్ధతిలో ఆఫీసుకు వచ్చేలా అవకాశం కల్పించారు.

మధుమేహం, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న యాబై ఏళ్లు వయసు దాటిన వారు స్వచ్ఛందంగా ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం కోరింది. ఇలాంటి వారికి ఏప్రిల్ 4 వరకు వైధ్య ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండా కమిటెడ్ లీవ్ జారీ చేస్తామని తెలిపారు.  ఈ మార్గదర్శకాల మేరకు  సగం సగం ఉద్యోగులతో వీక్లీ రోస్టర్ తయారు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.


More Telugu News