కరోనా భయంతో జైలుకు నిప్పంటించిన ఖైదీలు
- తమను విడుదల చేయాలంటూ ఖైదీల ఆందోళన
- ఉద్రిక్తంగా మారిన కోల్ కతా డమ్ డమ్ సెంట్రల్ జైలు
- అధికారులపై ఖైదీల దాడి!
జనసమూహాల నడుమ కరోనా అమితవేగంతో వ్యాపిస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో కోల్ కతాలోని డమ్ డమ్ సెంట్రల్ జైలు ఖైదీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమను బయటికి పంపించాలని, లేకపోతే కరోనాకు బలయ్యే ప్రమాదం ఉందని వారు అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఖైదీలు ఆవేశానికి లోనవడంతో జైల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఖైదీలు జైలుకు నిప్పంటించారు. పదేళ్లకు పైగా జైల్లో గడిపి సత్ప్రవర్తన చూపిన ఖైదీలకు కరోనా కారణంగా 15 రోజుల స్పెషల్ పెరోల్ ఇవ్వాలని జైలు అధికారులు నిర్ణయించడం కొందరు ఖైదీలకు రుచించలేదని, వారే జైలుకు నిప్పుపెట్టారని తెలుస్తోంది. అగ్నికీలలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. కాగా, ఈ ఘటనలో కొందరు జైలు అధికారులపై ఖైదీలు దాడికి దిగినట్టు సమాచారం. ఖైదీలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది.