నాడు యువీ, కైఫ్ అద్భుతంగా పోరాడారు.. ఇప్పుడు మనమంతా కరోనాపై పోరాడాలి: మోదీ

  • జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపిన యువరాజ్, కైఫ్
  • వాళ్ల  ట్వీట్‌కు స్పందించిన ప్రధాని
  • నాట్‌వెస్ట్ ట్రోఫీలో వారిద్దరి భాగస్వామ్యాన్ని గుర్తు చేసిన మోదీ
  • ఆ మాదిరిగా ప్రజలు ఇప్పుడు కరోనాపై పోరాడాలని పిలుపు
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు యావత్‌ దేశం ఒక్కటై పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, మహ్మద్ కైఫ్ 2002 నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్లో కష్టాల్లోపడ్డ జట్టును అద్భుత పోరాట స్ఫూర్తితో గట్టెక్కించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఆదివారం జనతా కర్ఫ్యూకు మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి భారత క్రికెటర్లు సోషల్ మీడియాలో మద్దతు తెలిపారు.

రేపు ప్రజలు ఇళ్ల నుంచి బయకు రావొద్దని, స్వచ్ఛందంగా సామాజిక దూరం పాటించాలని యువరాజ్, కైఫ్ ట్వీట్లు చేశారు. దీనికి స్పందించిన మోదీ నాడు ఇంగ్లండ్‌ జట్టుపై యువీ, కైఫ్ పోరాడినట్టుగా.. ఇప్పుడు కరోనాపై ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కైఫ్, యువీ ఇద్దరూ గొప్ప క్రికెటర్లని కొనియాడిన ప్రధాని నాట్‌వెస్ట్ ఫైనల్లో వారిద్దరి భాగస్వామ్యం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. వాళ్లిద్దరూ చెప్పినట్టుగా ఇప్పుడు మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాల్సి ఉంటుందన్నారు. అది దేశ ప్రజలంతా చేయాల్సిన పని అన్నారు. కరోనాపై చేసే పోరాటంలో యావత్‌ భారత్ మొత్తం భాగస్వామ్యం కావాలి అని మోదీ ట్విట్టర్లో సూచించారు.

2002  నాట్‌వెస్ట్  ట్రోఫీ ఫైనల్లో భారత్ ముందు ఇంగ్లండ్ జట్టు 326 పరుగుల లక్ష్యం ఉంచింది. అయితే, ఛేదనలో టాపార్డర్ విఫలమవడంతో 146 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. దాంతో,  ఓటమి తప్పదని అంతా భావించారు. కానీ, అసాధారణంగా పోరాడిన యువరాజ్ (69), కైఫ్ (87 నాటౌట్) ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. టీమిండియా సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటి కాగా.. కైఫ్, యువీ భాగస్వామ్యం కూడా చరిత్రలో నిలిచిపోయింది.


More Telugu News