మాస్కు ధర రూ.10 మించకూడదు: కేంద్ర మంత్రి

  • 200 ఎమ్.ఎల్ శానిటైజర్ రూ.100లోపే అమ్మాలి
  • కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ఆదేశం
  • కరోనా నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్ల ధరపై నియంత్రణ
దేశంలో  కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో మాస్కులు,శానిటైజర్లకు విపరీతమైన గిరాకీ పెరిగింది. ఇదే అదనుగా వర్తకులు వాటి ధరలు అమాంతం పెంచారు. అయితే, మాస్కులు,శానిటైజర్లను నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వాటి ధరలను కూడా అదుపులోకి తెచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు, శానిటైజర్లకు ధరలు నిర్దేశించామని కేంద్ర  వినియోగదారుల వ్యవహారాల శాఖ  మంత్రి రామ్‌ విలాస్ పాశ్వాన్ తెలిపారు.

నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీకి ముందు ఉన్న మాస్కుల ధరలనే కొనసాగిస్తామన్నారు. సర్జికల్ మాస్కు (టు, త్రీ ప్లై రకం) రిటైల్ ధర రూ. 8 అని, దాన్ని పది రూపాయలకంటే ఎక్కువ అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే, 200 ఎమ్.ఎల్. హాండ్ శానిటైజర్ బాటిల్ ధర రూ. 100 దాటకూడదని చెప్పారు. మిగతా సైజుల బాటిళ్ల ధరలు కూడా అదే నిష్పత్తిలో ఉంటాయని తెలిపారు. ఈ ధరలు జూన్‌ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.


More Telugu News