ఇది సామాజిక బాధ్యత... కరోనాపై సంయమనం పాటించండి: మీడియాకు ఏపీ సర్కారు మార్గదర్శకాలు

  • కరోనా వార్తలపై మార్గదర్శకాలు జారీ
  • వైద్యశాఖ నిర్ధారించిన అంశాలే ప్రచురించాలి, ప్రసారం చేయాలి
  • అనుమానం పేరుతో సమాచారాన్ని ప్రచురించరాదు
కరోనా కల్లోలం పేరుతో ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్ధాలతో కూడిన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సామాజిక బాధ్యతతో మీడియా సంయమనం పాటించాలని పేర్కొంటూ, కరోనా వార్తల ప్రచురణ కోసం కొన్ని మార్గదర్శకాలను నిన్న రాత్రి విడుదల చేసింది.

వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి పేరిట విడుదలైన ప్రకటనలో కరోనా వైరస్‌ (కోవిడ్‌ –19)కు సంబంధించి వార్తా కథనాలపై పత్రికలు, టీవీ చానళ్ల అధిపతులు, ఎడిటర్లు, బ్యూరో చీఫ్‌లు, రిపోర్టర్లు పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం పేర్కొంది. మార్చి 20వ తేదీన విశాఖలో కరోనా వైరస్‌తో మరణం అంటూ పలు వార్తా సంస్థలు, చానళ్లు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం వల్ల ఎదురైన ఆందోళనను దృష్టిలో పెట్టుకుని వీటిని జారీ చేసినట్టు తెలిపింది. ఈ మార్గదర్శకాలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  ప్రభుత్వం ఏం చెప్పిందంటే...
  • కరోనా వైరస్‌ కేసులు, మరణాల విషయంలో అధికారిక సమాచారాన్నే ప్రసారం చేయాలి. ఇందుకోసం వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిరోజూ బులెటిన్‌ విడుదల చేస్తుంది. అందులో నిర్ధారించిన సమాచారాన్ని మాత్రమే పత్రికలు, టీవీలు పరిగణనలోకి తీసుకోవాలి. అనుమానిత కేసుల పేరుతో సమాచారాన్ని ప్రచురించరాదు, ప్రసారం చేయకూడదు.
  • కరోనా వైరస్‌ సోకి పాజిటివ్‌గా వచ్చిన కేసుల విషయంలో బాధితుల పేర్లు, చిరునామాలు ప్రచురించకూడదు, ప్రసారం చేయరాదు. వదంతులు, ఊహాజనిత అంశాలను ప్రసారం చేయకూడదు.  ప్రచురించరాదు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వెబ్‌సైట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెబ్‌సైట్లను పరిశీలించడం ద్వారా వైరస్‌కు సంబంధించి సరైన సమాచారాన్ని పొందవచ్చు.
  • మూఢ నమ్మకాలను పెంపొందించేలా సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదు.
  • కరోనా నివారణ, ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రసార మాధ్యమాలు సహకరించాలి.


More Telugu News