కరోనా... అప్పుడు, ఇప్పుడు ఎలా ఉందో చూడండి!

  • జనవరి 19 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 100
  • ఇప్పడు 183 దేశాల్లో 2.50 లక్షల పాజిటివ్ కేసులు
  • మార్చి 10 నాటికి పదివేలు దాటిన మృతుల సంఖ్య
చైనాలోని వుహాన్ నగరంలో అంతుచిక్కని వ్యాధిగా మొదలై కరోనా వైరస్ గా నామకరణం చేసుకున్న మహమ్మారి ఇప్పుడు ప్రపంచానికి సవాల్ విసురుతోంది. అగ్రరాజ్యాలు సైతం ఈ వైరస్ భూతాన్ని ఎదుర్కోవడానికి సర్వశక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత డిసెంబరు నుంచి చైనా సహా ప్రపంచ దేశాలు ఈ ప్రాణాంతక వైరస్ ఉనికిపై ఓ అవగాహనకు వచ్చాయి. అయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఉమ్మడి కార్యాచరణ లేకపోవడంతో బాధితుల సంఖ్య కొద్దికాలంలోనే విపరీతంగా పెరిగిపోయింది.

జనవరి 19 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 100 మాత్రమే. ఆ తర్వాత ఎంత వేగంగా పాకిపోయిందో చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఫిబ్రవరి 19 నాటికి కరోనా కేసులు 76 వేలకు చేరాయి. ప్రస్తుతం 183 దేశాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 2.50 లక్షలుగా నమోదైంది.

జనవరి 22 నాటికి కరోనా కారణంగా 17 మంది మృతి చెందితే, ఫిబ్రవరి 20 నాటికి 2,247 మంది మరణించారు. మార్చి 10 నాటికి ఆ సంఖ్య ఐదింతలై మృతుల సంఖ్య 10,541కి చేరింది. ముఖ్యంగా చైనా వెలుపల అత్యధిక మరణాలు ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాల్లో సంభవించాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ కరోనా పెద్దసంఖ్యలో ప్రాణాలను బలిగొనడం ఆందోళన కలిగిస్తోంది.


More Telugu News