బేర్ గ్రిల్స్ తో కలిసి రజనీకాంత్ రోమాంఛక విన్యాసాలు... వీడియో ఇదిగో!

  • రజనీకాంత్ తో బేర్ గ్రిల్స్ 'ఇంటూ ద వైల్డ్' ఎపిసోడ్ చిత్రీకరణ
  • డిస్కవరీ చానల్లో ఈ నెల 23న ప్రసారం
  • స్నీక్ పీక్ మూమెంట్స్ వీడియో విడుదల చేసిన చానల్
  • బస్ కండక్టర్ నని చెప్పి గ్రిల్స్ ను ఆశ్చర్యానికి గురిచేసిన రజనీ
గుక్కెడు నీళ్లు లేని నరకం వంటి ఎడారులు, కాకులు దూరని కారడవులు, మంచు తప్ప ఏమీ కనిపించని అతిశీతల ప్రాంతాలు.. ఇలా ఎక్కడైనా మనుగడ సాగించగలనని నిరూపించడం బేర్ గ్రిల్స్ కే చెల్లుతుంది. తాజాగా ఈ ప్రపంచ సాహసికుడు దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ఇంటూ ద వైల్డ్ కార్యక్రమం కోసం స్పెషల్ ఎపిసోడ్ రూపొందించాడు. ఈ కార్యక్రమం డిస్కవరీ చానల్లో మార్చి 23న రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ ఎపిసోడ్ కోసం రజనీకాంత్, బేర్ గ్రిల్స్ జోడీ కర్ణాటకలోని బండిపుర అరణ్యాలకు వెళ్లింది. తాజాగా, దీనికి సంబంధించిన స్నీక్ పీక్ మూమెంట్స్ వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో రజనీకాంత్ విన్యాసాలను చూడొచ్చు. ఓ వంతెన ఇనుప రెయిలింగ్ పై రజనీ, బేర్ గ్రిల్స్ నడవడం సినిమా స్టంట్ కు తీసిపోని విధంగా ఉంది. కాగా, సినిమాల్లోకి రాకముందు మీరేం చేసేవారు? అని బేర్ గ్రిల్స్ ప్రశ్నించగా, 'బస్ కండక్టర్' అని రజనీకాంత్ జవాబు చెప్పారు. దాంతో బేర్ గ్రిల్స్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు.

మరో సంభాషణలో తాను సినిమాల వరకే రజనీకాంత్ నని, ఇంటికి వెళితే శివాజీరావ్ గైక్వాడ్ నని తెలిపారు. ఎవరన్నా గుర్తు చేస్తే తప్ప రజనీకాంత్ నన్న విషయం జ్ఞప్తికి రాదని, షూటింగ్ తర్వాత రజనీ అనే పేరును మర్చిపోతానని వివరించారు. అంతేకాదు, ఇలాంటి సాహసాలను తన జీవితంలో ఎన్నడూ చేయలేదని రజనీకాంత్ విస్మయం వ్యక్తం చేశారు.



More Telugu News