ఇది మహమ్మారి... నిర్లక్ష్యం వహించారంటే లక్షల్లో మరణాలు: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

  • కరోనాను కార్చిచ్చుతో పోల్చిన సెక్రటరీ జనరల్
  • ఇలాగే వదిలేస్తే అదుపుచేయడం కష్టసాధ్యమని వెల్లడి
  • ప్రపంచదేశాలు ఉమ్మడిగా ముందుకు కదలాలని పిలుపు
కరోనా మహమ్మారి చైనాను దాటివచ్చి అనేక దేశాల్లో తిష్టవేసి ప్రజలను, ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 10 వేల మరణాలు సంభవించినట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. దీనిపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరాస్ కీలక ప్రకటన చేశారు. దీన్ని కార్చిచ్చుతో పోల్చారు. కరోనా వ్యాప్తిపై నిర్లక్ష్యం వహిస్తే లక్షల్లో ప్రాణాలు కోల్పోతారని దేశాలను హెచ్చరించారు. ఈ వైరస్ భూతాన్ని అలాగే వదిలేస్తే పరిస్థితిని అదుపు చేయడం చాలా కష్టమని అన్నారు. ఇలాంటి తరుణంలో ప్రపంచదేశాలన్నీ తమ స్వీయ సన్నద్ధతను చూసుకుంటూనే, ఇతర దేశాలతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలని సూచించారు.

ఆంటోనియో గుటెరాస్ చేసిన వ్యాఖ్యలు, సూచనలు ఇవిగో...

  • ప్రతి దేశం వ్యూహాత్మక చర్యలు చేపడుతూనే, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని దేశాలను కూడా ఆదుకోవాలి.
  • కరోనాపై పోరులో జీ20 దేశాలు ముందుండాలి. ఆర్థికంగా బలమైన దేశాలు స్వీయ పరిరక్షణతో సరిపెట్టుకోకుండా ఆఫ్రికా పేద దేశాలపైనా, అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలపైనా దృష్టి సారించాలి.
  • త్వరలోనే ఈ వైరస్ ప్రతి ఒక్క దేశాన్ని తాకుతుంది. జీ20 దేశాలు ఇతర దేశాలకు సాయం చేయకపోతే దారుణ ఫలితాలు వస్తాయి.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అన్ని దేశాలు పాటించాలి.
  • ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
  • అల్పాదాయ, చిన్న, మధ్య తరహా వ్యాపారులను ఆదుకోవాలి. సామాజిక ఉద్యోగ భద్రత, జీతాలు ఇవ్వడం, బీమా సౌకర్యాలు వంటి వాటితో చేయూతనివ్వాలి.
  • ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దేశాలను వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆదుకోవాలి.
  • స్వదేశీ వస్తు రక్షణ విధానం పాటిస్తున్న దేశాలు ఈ తరుణంలో కాస్త వెసులుబాటు నిర్ణయాలు తీసుకోవాలి.
  • దేశాలు తమ మధ్య ఉన్న వాణిజ్య విభేదాలను పక్కనబెట్టి సరికొత్త సప్లై చైన్ వ్యవస్థలను పునరుద్ధరించాలి.


More Telugu News