తెలంగాణలో మరో రెండు ‘కరోనా’ కేసులు

  • తెలంగాణలో మరో రెండు ‘కరోనా’ పాజిటివ్ కేసులు
  • గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స 
  • 18కి చేరిన ‘కరోనా’ కేసుల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, ‘కరోనా’ కేసుల సంఖ్యల 18కి చేరింది. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, లండన్ నుంచి వచ్చిన ఇద్దరు భారతీయులకు ఈ వైరస్ సోకినట్టు తేలిందని అన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నట్లు  చెప్పారు.

విదేశాల నుంచి వచ్చిన వారికే ‘కరోనా’ సోకిందని, పద్దెనిమిది కేసుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో నలుగురు రెండ్రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని, ఈ వైరస్ నుంచి కోలుకున్న ఒకరిని డిశ్చార్జి చేశామని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నివసిస్తున్న ఎవరికీ ‘కరోనా’ సోకలేదని, విదేశాల నుంచి వచ్చిన వారే దీని బారినపడ్డారని మరోమారు స్పష్టం చేశారు.

కారణం తెలియదు కానీ, బాధితుల నుంచి వైరస్ వ్యాప్తి చెందడం తక్కువగా ఉందని, బాధిత కుటుంబ సభ్యులకు, చికిత్స అందిస్తున్న ఎవరికీ ‘కరోనా’ వ్యాప్తి చెంద లేదని అన్నారు. ‘కరోనా’ విషయంలో రాష్ట్రం తీసుకున్న చర్యలను కేంద్రంగా కూడా ప్రశంసించిందని, అధిక ఉష్ణోగ్రతల ప్రదేశంలో ఈ వైరస్ బతకదని నిపుణులు చెబుతున్నారని అన్నారు. ఒకవేళ బాధితుల సంఖ్య పెరిగితే ఏం చేయాలో కూడా తాము ఆలోచించామని, ‘కరోనా’ సోకితే అద్దె ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయిస్తారు కనుక, వేల మందిని క్వారంటైన్ చేయగలిగేలా సన్నద్ధం అయినట్టు వివరించారు.  


More Telugu News