ధోనీ సైలెంట్‌గా రిటైర్‌‌ అవుతాడు: సునీల్ గవాస్కర్

  • టీమిండియాలో రీఎంట్రీ  చాలా కష్టం
  • టీ20 ప్రపంచకప్‌లో ఆడడం సాధ్యం కాకపోవచ్చు
  • జట్టు అతడిని దాటి ముందుకెళ్లిందన్న సన్నీ
భారత్‌కు టీ20, వన్డే ప్రపంచకప్‌లు అందించిన మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యంపై రోజుకో వార్త వస్తోంది. గత వన్డే వరల్డ్ కప్ నుంచి జట్టుకు దూరంగా ఉంటున్న ధోనీ.. ఐపీఎల్ ఆడి తిరిగి టీమిండియాలోకి వస్తాడని చాలా మంది భావించారు. జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

కానీ, కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ ఐపీఎల్ తిరిగి జరిగే అవకాశం కనిపించడం లేదు. దాంతో, మహీ రీఎంట్రీ కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా జాతీయ జట్టులోకి అతను తిరిగి రావడం కష్టమే అంటున్నాడు. అతను సైలెంట్‌గా రిటైర్‌‌ అవుతాడని అభిప్రాయపడ్డాడు.

‘వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో ఆడే భారత జట్టులో ధోనీ ఉండాలని నేను కోరుకుంటున్నా. కానీ, అది సాధ్యం కాకపోవచ్చు. జట్టు ఇప్పుడు ధోనీని దాటి ముందుకెళ్లింది. అతను పెద్ద ప్రకటనలు చేసి హడావిడి చేసే వ్యక్తి కాదు. అందువల్ల క్రికెట్ నుంచి అతను నిశ్శబ్దంగా వైదొలుగుతాడని భావిస్తున్నా’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్‌ కోసం చెన్నై సూపర్‌‌ కింగ్స్‌ టీమ్‌తో కలిసి ధోనీ కొన్ని రోజులు ప్రాక్టీస్‌ చేశాడు. కానీ, కరోనా నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడడం, ప్రాక్టీస్‌ను అన్ని జట్లు రద్దు చేసుకోవడంతో మహీ తన సొంత నగరం రాంచీకి వచ్చేశాడు.


More Telugu News