స్టాక్ మార్కెట్: నాలుగు రోజుల్లో రూ. 19 లక్షల కోట్ల నష్టం... నేడు రూ. 2 లక్షల కోట్ల లాభం!

  • సోమవారం నుంచి నష్టాల్లోనే మార్కెట్
  • నేడు కాస్తంత రికవరీ
  • 600 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్
గడచిన సోమవారం నుంచి గురువారం వరకూ ఈక్విటీల అమ్మకాలు వెల్లువెత్తగా, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 5,800 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 19.49 లక్షల కోట్లు హారతి కర్పూరం కాగా, లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 1.09 లక్షల కోట్లకు తగ్గిపోయింది. కరోనా కేసులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనతో తమ వద్ద ఉన్న షేర్లను అమ్మేందుకే ఆసక్తిని చూపారు.

ఇదే సమయంలో ప్రపంచ మార్కెట్లు సైతం ఇండియాపై ప్రభావాన్ని చూపాయి. కరోనా కారణంగా ప్రపంచ జీడీపీ పడిపోనుందన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించాయి. దీంతో ఈ వారం ప్రారంభం నుంచి నష్టాల్లో సాగిన సూచీలు, శుక్రవారం మాత్రం కాస్తంత తేరుకున్నాయి.

ఈ ఉదయం 11.45 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 624 పాయింట్లు పెరిగి 2.21 శాతం లాభంతో 28,912 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, 196 పాయింట్లు పెరిగి, 2.38 శాతం లాభంతో 8,460 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ-50లో 40 కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి.

 గురువారంతో పోలిస్తే, ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఆరంభంలో కొంత మేరకు సూచీలు తడబడినా, ఆసియా మార్కెట్లలో అత్యధిక సూచీలు లాభాల్లో ఉండటం, నిన్నటి అమెరికా మార్కెట్ లాభాలు ఇన్వెస్టర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.


More Telugu News