1892లోనూ తిరుమలలో ఆగిన దర్శనాలు... ఆనాటి కారణం ఇదే!

  • ఆలయ ఆధిపత్యం కోసం జియ్యంగార్లు, మహంతుల మధ్య వివాదం
  • రెండు రోజుల పాటు ఆగిన దర్శనాలు
  • తిరిగి 128 ఏళ్లకు కరోనా భయంతో దర్శనాలు రద్దు
దాదాపు 128 ఏళ్ల తరువాత కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం భక్తులకు కలగని పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్యాహ్నం నుంచి అన్ని రకాల దర్శనాలనూ టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆలయ చరిత్రలో 1892వ సంవత్సరంలో ఇలా జరిగింది. అప్పట్లో రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేశారు. అప్పటికి టీటీడీ ఏర్పడలేదు.

ఆనాడు ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జియ్యంగార్లు, మహంతుల మధ్య వివాదం తలెత్తింది. ఆలయ ఆధిపత్యం కోసం వారిలో వారు గొడవలు పడ్డ వేళ, ఆలయానికి తాళాలు పడ్డాయి. తిరిగి ఇంతకాలానికి కరోనా వైరస్ వ్యాప్తి భయాలతో భక్తులకు దర్శనాలను నిలిపివేసిన అధికారులు, వారం రోజుల పాటు స్వామివారికి ఏకాంత కైంకర్యాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఇక కల్యాణోత్సవం ఏకాంతంగా జరుగుతుందని, నిత్య సేవల్లో భాగమైన ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, డోలోత్సవం వంటివి తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, ఈ వారం రోజులూ సుప్రభాతం, అర్చన, పవళింపు సేవ తదితరాలు ఏకాంతంగా జరుగుతాయని వెల్లడించారు.


More Telugu News