ద్వారకాతిరుమల ఆలయం కూడా మూసివేత
- మధ్యాహ్నం పూజల అనంతరం తాళాలు
- ఇప్పటికే ఆర్జిత సేవలు నిలుపుదల
- ఆన్ లైన్ టికెట్ల విక్రయం నిలిపివేత
చిన్న తిరుపతిగా భక్తులు చెప్పుకునే పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ఆలయాన్ని కూడా మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా విస్తరణ కట్టడి దృష్ట్యా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించరాదని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్జిత సేవలను రద్దు చేశారు. తాజాగా భక్తుల దర్శనంతోపాటు కేశఖండనశాల, అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా మూసివేయాలని నిర్ణయించారు. ఆన్ లైన్ టికెట్ల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.