ఉరి శిక్ష అమలు వార్త తెలిసిన వెంటనే కుమార్తె ఫొటోను హత్తుకున్న ఆశాదేవి!

  • ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరిశిక్ష అమలు
  • నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందన్న ఆశాదేవి
  • ఇకపై తమ పోరాటం మన కుమార్తెల కోసమని ప్రకటన
తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు దోషులు నలుగురికీ ఉరితీత పూర్తయిన తర్వాత నిర్భయ తల్లి ఆశాదేవి విజయ చిహ్నం చూపిస్తూ సంతోషంగా కనిపించారు.

తన కుమార్తె లేదని, ఇకపై రాదని పేర్కొన్న ఆమె.. కుమార్తెను కోల్పోయిన తర్వాత తాము పోరాటం ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు తమ పోరాటం నిర్భయ గురించేనని, ఇకపై ‘మన కుమార్తె’ల కోసం పోరాడతానని చెప్పారు. దోషులకు ఉరిశిక్ష అమలు జరిగిన వెంటనే తన కుమార్తె ఫొటోను హత్తుకున్నానని ఆశాదేవి ఉద్వేగభరితంగా అన్నారు.

మొత్తానికి వారికి ఉరిపడిందని పేర్కొన్న ఆశాదేవి.. ఇదో సుదీర్ఘకాల బాధ అని అన్నారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజును దేశంలోని అందరి కుమార్తెలకు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. భారత ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు ఆశాదేవి కృతజ్ఞతలు తెలిపారు.


More Telugu News