నిర్భయ దోషుల ఉరిపై ఆసక్తికర అంశాలు వెల్లడించిన తీహారు జైలు అధికారి!

  • శుక్రవారం ఉదయం నలుగురికీ ఒకేసారి ఉరి
  • ఏర్పాట్లపై గురువారం సాయంత్రం మరోసారి సమీక్ష
  • దోషులతో మాట్లాడనున్న మానసిక నిపుణులు
  • దోషుల కదలికలపై అధికారులతో గస్తీ
ఎనిమిదేళ్ల కిందట దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులను రేపు  ఉరితీయనున్నారు. ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేస్తారు. ఉరితీత ప్రక్రియ గురించి తీహార్ జైలు అధికారి ఒకరు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. నిర్భయ దోషులు నలుగురినీ ఒకేసారి ఉరి తీస్తారని, అందుకే గురువారం సాయంత్రం వారి ఉరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను మరోసారి సమీక్షించుకుంటామని చెప్పారు.

అనంతరం జైలు ఉన్నతాధికారులు దోషులతో ప్రత్యేకంగా మాట్లాడతారని, వారి చివరి కోరికలు ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరతారని ఆ అధికారి వివరించారు. మరణశిక్ష నేపథ్యంలో దోషులను సంసిద్ధులను చేసేందుకు వారిని మానసిక నిపుణులతో మాట్లాడిస్తామని తెలిపారు. ప్రస్తుతం నిర్భయ దోషులను మూడో నెంబరు జైల్లో ఉంచామని, వారి కదలికలపై పరిశీలన కోసం అధికారులు కూడా గస్తీ విధుల్లో పాలుపంచుకుంటారని వెల్లడించారు. ఇక, ఉరి ప్రక్రియ యావత్తు గంటలో ముగుస్తుందని అన్నారు.

కాగా, నిర్భయ దోషుల ఉరితీత కోసం తీహార్ జైలు అధికారులు మీరట్ జైలు నుంచి పవన్ జల్లాడ్ అనే తలారిని తీసుకువచ్చారు. నలుగురినీ ఉరితీసినందుకు జల్లాడ్ కు రూ.15 వేలు ఇస్తారు. రేపు ఉదయం దోషులను ఉరితీసే సమయంలో వేదిక వద్ద తలారితో పాటు ఓ డాక్టర్, కొందరు జైలు అధికారులు మాత్రమే ఉంటారు.


More Telugu News