జగన్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి చివాట్లు తిన్నారు: యనమల

  • డిపాజిట్లు కూడా రావని వైసీపీ భయపడుతోందన్న యనమల
  • ప్రజల ప్రాణాలంటే జగన్ కు లెక్కలేదని విమర్శలు
  • సర్కారు వింతపోకడలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని వ్యాఖ్యలు
కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహిస్తే డిపాజిట్లు కూడా రావని వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని కోరుతున్నాయని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లి చివాట్లు తిన్నారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, కరోనాపై రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధతపై యనమల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రపంచదేశాలన్నీ కరోనాపై సత్వర చర్యలు తీసుకుంటుంటే జగన్ సర్కారు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జగన్ ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలు జరపడమే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రతి గంటకు కరోనాపై సమీక్షిస్తున్నారని, ఏపీలో ఆరోగ్య శాఖ కార్యదర్శి ఏం చేస్తున్నారో తెలియడంలేదని యనమల వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారు వింత పోకడలతో ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు.


More Telugu News